Homeక్రైమ్9 ఏళ్ల బాలికను స్తంభానికి కట్టేసి చిత్రహింసలు.. దహనం చేస్తామని బెదిరింపులు..!

9 ఏళ్ల బాలికను స్తంభానికి కట్టేసి చిత్రహింసలు.. దహనం చేస్తామని బెదిరింపులు..!

నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై అమానుషంగా వ్యవహరించినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొట్టాల చెరువు చెంచుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

స్థానికంగా లభించిన వివరాల ప్రకారం.. నాలుగో తరగతి చదువుతున్న బాలిక పావని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. చివరకు ఓ దుకాణం నిర్వహించే వ్యక్తి ఇంట్లో బాలిక ఉన్నట్లు గుర్తించారు. బాలికను తాళ్లతో స్తంభానికి కట్టేసి కొంతసేపు నిర్బంధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించిందనే అనుమానంతోనే బాలికను బంధించినట్లు సంబంధిత వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని బాలిక తన తల్లిదండ్రుల వద్ద కన్నీరుమున్నీరైనట్లు సమాచారం.

బాలిక వాంగ్మూలం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తన చేతులపై అగరుబత్తులతో కాల్చారని, బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను దహనం చేసి సమీపంలోని వరదరాజ స్వామి ప్రాజెక్టు ప్రాంతంలో పడేయాలని మాట్లాడుకున్నట్లు కూడా బాలిక చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలికను బంధించిన ఘటనపై కుటుంబ సభ్యులు, గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనకు సంబంధించి బాలికను ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే కేసు నమోదు, దర్యాప్తు తదితర అంశాలపై పోలీసుల నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

also read: అనుపమ–ధృవ్ బ్రేకప్‌పై మరోసారి చర్చ.. వైరల్ అవుతున్న పాత వీడియోలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు