క్రైమ్ మిర్రర్ : పాలు, వెన్న లేకుండానే ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలతో కల్తీ నెయ్యి తయారు చేసి, దానిని ‘ప్యూర్ నెయ్యి’, ‘ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి’ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును హెచ్-ఫాస్ట్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా కల్తీ నెయ్యి, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
130 కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు
హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై హెచ్-ఫాస్ట్ అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. నగరవ్యాప్తంగా 39 తయారీ కేంద్రాలు, 91 ఔట్లెట్లలో.. మొత్తం 130 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల సందర్భంగా ఆయా కేంద్రాల్లో లభించిన నెయ్యి నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రాథమిక పరిశీలనలో కొన్ని నమూనాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 36 వేల కిలోల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
పాలు, వెన్న లేకుండానే తయారీ
పోలీసుల విచారణలో కల్తీ నెయ్యి తయారీకి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాల పౌడర్‌కు పామ్ ఆయిల్, డాల్డా, సువాసన కోసం ఉపయోగించే రసాయనాలను కలిపి నెయ్యి మాదిరిగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పాలు, వెన్న వంటి అసలు ముడి పదార్థాలను ఉపయోగించకుండానే ఇతర పదార్థాలతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘100 శాతం ప్యూర్’ పేరుతో విక్రయాలు
కల్తీ నెయ్యిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ‘100 శాతం ప్యూర్ నెయ్యి’, ‘ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి’, ‘ప్రీమియం నెయ్యి’ వంటి పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని ఉత్పత్తులపై సరైన లేబులింగ్, తయారీ వివరాలు లేకుండానే వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెస్టారెంట్లు, స్వీట్ షాపులకూ సరఫరా
ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, డాబాలు, ఆయుర్వేద మందుల దుకాణాలు, కొన్ని హోటళ్లు, డెయిరీ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని వ్యాపార సంస్థలు కూడా దీనిని ‘ప్యూర్ నెయ్యి’గా వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే కొన్ని ముడి పదార్థాలను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, వాటికి వివిధ రసాయనాలను కలిపి నెయ్యిగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
హానికరమైన పదార్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. తక్కువ ధరకు లభిస్తుందనే కారణంతో లేబులింగ్ లేని నెయ్యి లేదా ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని కోరారు. ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు ఫుడ్ లైసెన్స్, తయారీ వివరాలు, లేబులింగ్, ఇతర తప్పనిసరి వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. కల్తీకి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కల్తీపై సమాచారం ఉంటే డయల్ 100/112 లేదా హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
