-
పొలిటికల్ ఎంట్రీ కి అలేఖ్య రెడ్డి సిద్ధం
-
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నందమూరి కుటుంబానికి తెలుగు రాజకీయాలతో విడదీయరాని బంధం. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ కుటుంబం నుంచి కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. మరోవైపు అల్లుడు నారా చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రం తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పాత్ర పోషించారు. అదే కుటుంబం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు సైతం రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు రంగంలోకి రానున్నట్లు తెలుస్తోంది. దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి టిడిపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
చాలా యాక్టివ్ గా తారకరత్న…
Also Read:కంగనా రనౌత్ మరోసారి క్లారిటీ.. ‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై ఘాటు వివరణ
నందమూరి తారకరత్న తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ తో సన్నిహితంగా ఉండేవారు. నందమూరి బాలకృష్ణతో సైతం మంచి సంబంధాలు నడిపేవారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు.. 2023 ఫిబ్రవరిలో ఆయన హఠాన్మరణం చెందారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. చాలా రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని చూశారు తారకరత్న. ఇంతలోనే ఆయన కన్నుమూశారు.
భర్త ఆశయ సాధన కోసం…
Also Read:ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఎన్నికల అధికారులు.. ముదిరిన ఓటు వివాదం
నందమూరి తారకరత్న మృతి తర్వాత అలేఖ్య రెడ్డికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. ఆమె స్వయాన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తోడల్లుడు కుమార్తె. అయితే ఇప్పుడు అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ వైపు ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న మధ్యన ఆమె తారకరత్న ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆమె అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు సమాచారం.. తారకరత్న వివాహానికి ముందు ఆమె మోడలింగ్ రంగంలో ఉండేవారు. అయితే పిల్లల కోసం మళ్లీ అదే మోడలింగ్ రంగంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగుదేశం పార్టీలో చేరి తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
