క్రైమ్ మిర్రర్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అనంతరం ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది. ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషకు సంబంధించిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో భాగంగా ఉదయం ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పోలీసులు తమ వాదనలు వినిపిస్తూ, ఉదయనిధిని రిమాండ్‌కు తరలించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో విచారణ నిమిత్తమే ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం విడుదల చేస్తామని పేర్కొన్నారు. వాదనలు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కేసు విచారణకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఉదయనిధి అరెస్ట్, అనంతరం బెయిల్ మంజూరు వ్యవహారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
also read : అరెస్ట్‌పై మండిపడ్డ ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
