క్రైమ్ మిర్రర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చిన్నారిపై అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మూత్రం పోసుకున్నాడనే కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు బాలుడిపై తీవ్రంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పోలీసులకు బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వారణాసికి చెందిన కేసరీ జైశ్వాల్ దంపతుల ఐదేళ్ల కుమారుడు పాండేపూర్ ప్రాంతంలోని సరీన్ సోనీ ప్లే స్కూల్‌లో చదువుతున్నాడు. జూలై 24న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు శరీరంలో నొప్పిగా ఉందని తల్లికి చెప్పాడు.
బాలుడిని పరిశీలించిన తల్లి అతడి శరీరంపై గాయం గుర్తులు కనిపించడంతో ఆందోళనకు గురైంది. ఏం జరిగిందని అడగగా, తనకు మూత్రం వస్తోందని ఉపాధ్యాయురాలికి చెప్పినప్పటికీ బాత్రూమ్‌కు అనుమతించలేదని, దీంతో దుస్తుల్లోనే మూత్రం పోయానని బాలుడు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఉపాధ్యాయురాలు తనను మరో గదిలోకి తీసుకెళ్లి స్టవ్‌పై కత్తిని కాల్చి తనకు వాత పెట్టినట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
స్కూల్ యాజమాన్యం నుంచి తగిన స్పందన రాకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఉపాధ్యాయురాలు ప్రీతీ కుశ్వాహతో పాటు పాఠశాల ప్రిన్సిపల్, యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి వాంగ్మూలం, వైద్య పరీక్షలు, పాఠశాల సిబ్బంది నుంచి సేకరించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. చిన్నారిపై జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటన తీవ్రంగా బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
also read : Bala Krishna: బాలయ్య త్వరగా కోలుకోవాలని ఎన్‌బికె111 టీమ్ ప్రత్యేక మహాయాగం..
