క్రైం మిర్రర్ : వరంగల్ నగరంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉర్సు గుట్ట సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని మాడ అనిల్ (23)గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు అనిల్‌పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. అనిల్ హత్యకు పాత కక్షలే కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు అసలు కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.
రాజకీయ వర్గాల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వరుసగా చోటుచేసుకుంటున్న హత్య ఘటనల నేపథ్యంలో పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత హత్యకు గురైన ఘటన మరువక ముందే మరో కార్యకర్త హత్యకు గురికావడంతో పార్టీ శ్రేణుల్లో కలకలం నెలకొంది. హత్య వెనుక ఉన్న కారణాలు, నిందితుల పాత్రపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
also read : నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయ నావికుడు మృతి
