క్రైం మిర్రర్ : ప్రభుత్వ సంక్షేమ పథకం కింద వచ్చిన ఆర్థిక సహాయం ఓ కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం నగదు విషయంలో తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసిన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. పిటియం మండలం రాపూరివారిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రణీత్ ఐదో తరగతి, చిన్న కుమారుడు విష్ణు మూడో తరగతి చదువుతున్నారు.
విద్యార్థుల విద్యా అవసరాల కోసం ప్రభుత్వం ఇటీవల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ డబ్బులను కుటుంబ అవసరాల కోసం ఉపయోగించాలని సురేష్ భావించగా, పద్మావతి మాత్రం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగినట్లు తెలుస్తోంది. నగదు విషయంలో చోటుచేసుకున్న గొడవ తీవ్రరూపం దాల్చడంతో క్షణికావేశంలో సురేష్ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పద్మావతి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.
also read :ఆస్తి కోసం కుట్ర.. మెట్‌పల్లి కాల్పుల కేసులో నలుగురు అరెస్ట్
