క్రైం మిర్రర్ : జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సంచలనం సృష్టించిన గోనెల లక్ష్మిపై కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు మెట్పల్లి డీఎస్పీ రాములు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన షూటర్‌తో పాటు కుట్రకు సహకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్ అలియాస్ జేసీబీ శంకర్ కుటుంబానికి, అతని అన్న రాజం కుటుంబానికి మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. కుటుంబానికి చెందిన భూమి, ఇంటి విషయంలో తలెత్తిన విభేదాలు చివరకు హత్యాయత్నానికి దారితీశాయి.
ఆస్తి మొత్తం తమ ఆధీనంలోకి రావాలనే ఉద్దేశంతో శంకర్, అతని భార్య అనూష, బంధువు గోపి ముత్తయ్య కలిసి లక్ష్మిని తొలగించాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా శంకర్ వద్ద పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ వర్మను సంప్రదించి కాల్పులకు ఒప్పించినట్లు వెల్లడించారు. కాల్పుల కోసం ఆయుధాన్ని సమకూర్చుకునేందుకు ముందస్తుగా డబ్బులు ఇచ్చారని, ఘటన అనంతరం సచిన్‌ను విదేశాలకు పంపిస్తామని ఆశ చూపినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో సచిన్ ఓ వ్యక్తి నుంచి దేశీయ పిస్టల్, తూటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అనంతరం ఆయుధాన్ని మెట్‌పల్లికి తీసుకొచ్చి కుట్రదారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారం జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో సచిన్ ముఖానికి ముసుగు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చి నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ గురితప్పి ఆమె చెంపకు తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన అనంతరం పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో మహిళకు తగిలింది బుల్లెట్ గాయమేనని నిర్ధారణ కావడంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది.
మెట్పల్లి డీఎస్పీ ఎ. రాములు ఆధ్వర్యంలో సీఐ బి. సురేష్ బాబు, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ బృందం దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించింది. ఇప్పటికే శంకర్, అనూష, గోపి ముత్తయ్యలను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన షూటర్ సచిన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నాటు పిస్టల్, రెండు తూటాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
read also : భారీ పేలుడుతో దద్దరిల్లిన పాకిస్థాన్.. 15 మంది భద్రతా సిబ్బంది మృతి
