క్రైం మిర్రర్ : ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని టాంక్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పాకిస్థాన్ సైన్యం వెంటనే ప్రతీకార చర్యలు చేపట్టి పలువురు ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం.. టాంక్ జిల్లాలోని ఒక భద్రతా తనిఖీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని రక్షణ గోడకు ఢీకొట్టారు. దీంతో సంభవించిన భారీ పేలుడులో 15 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దాడి అనంతరం అప్రమత్తమైన పాకిస్థాన్ భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి ప్రతీకార ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో 12 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం వెల్లడించింది.
ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా బాధ్యత వహించలేదు. అయితే ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇది ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)’ మిలిటెంట్ గ్రూప్ పని అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ఆర్మీ స్పందిస్తూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 15 మంది భద్రతా సిబ్బందికి నివాళి అర్పించింది.
also read : హాస్టల్‌లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
