క్రైం మిర్రర్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లి గ్రామానికి చెందిన యమల కాసిం కుమార్తె మానస ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ గురునానక్ విద్యాసంస్థలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
also read :ఉత్కంఠ రేపుతున్న ఫిరోజ్‌నగర్ భూ వివాదం…!
