-
మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుపై నేడు జాయింట్ కలెక్టర్ తీర్పు వెలువడే అవకాశం..
క్రైమ్ మిర్రర్ (రంగారెడ్డి ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఫిరోజ్‌నగర్ గ్రామంలో 46 మంది రైతులు, మందుముల వారసుల మధ్య కొనసాగుతున్న 180.03 గుంటల ఇనాం భూమి వివాదం కీలక దశకు చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలోని ఎఫ్ సెక్షన్‌లో నేడు (శనివారం) తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ భూమి వివాదానికి సంబంధించి గతంలో జాయింట్ కలెక్టర్ కార్యాలయం, హైకోర్టులో విచారణలు జరిగినట్లు సమాచారం. తుది తీర్పు కోసం గ్రామ ప్రజలు, మందుముల వారసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామస్థుల కథనం ప్రకారం, గత 70 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న భూముల రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగాయని, రైతుల పేర్లు తొలగించి మందుముల వారసుల పేర్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read:నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, నిందితుడిపై పోక్సో కేసు
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి రికార్డులను పరిశీలించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై మందుముల వారసుల స్పందన ఇంకా తెలియరాలేదు. అలాగే సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి కూడా అధికారిక వివరణ వెలువడలేదు. నేడు వెలువడనున్న జాయింట్ కలెక్టర్ తీర్పుతో ఈ భూ వివాదానికి ముగింపు పలుకుతుందా? లేక మరో న్యాయపరమైన పోరాటానికి దారితీస్తుందా? అనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. తీర్పు అనంతరం ఫిరోజ్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read:అర్ధం కానీ జగన్ వ్యూహం..!
