క్రైం మిర్రర్ : మహబూబాబాద్ జిల్లాలో పాము కాటుకు గురైన ఓ యువకుడు సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ సంఘటన తొర్రూరు మండలం మడిపల్లి శివారు సోమవరపుకుంట తండాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటి ముందు ఏర్పాటు చేసిన షెడ్‌లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాము అతని కాలి మడమ వద్ద కాటు వేసినట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన ప్రవీణ్ పామును చంపగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. అయితే తనకు ఎలాంటి ప్రమాదం లేదని భావించి వైద్య చికిత్సను వాయిదా వేసినట్లు సమాచారం.
కొంతసేపటి తర్వాత అతనికి అస్వస్థత లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతడు తల్లి, భార్యతో పాటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతని మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో సోమవరపుకుంట తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాము కాటుకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
also read : “డ్రైవర్ కాదు… సహోద్యోగి!” – ఒక మాటతో మనసులు గెలిచిన యజమాని