Homeక్రైమ్అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. సీసీటీవీలో రికార్డైన కాల్పుల దృశ్యాలు

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. సీసీటీవీలో రికార్డైన కాల్పుల దృశ్యాలు

క్రైం మిర్రర్ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీసీటీవీ ఫుటేజీలో ఉగ్రవాది పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియోలో కనిపించిన వివరాల ప్రకారం.. మార్కెట్ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీపై ఓ ఉగ్రవాది వెనుక నుంచి కాల్పులు జరిపాడు. సమీప దూరం నుంచి జరిగిన ఈ కాల్పుల్లో ఖురేషీ తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. మరో ఫుటేజీలో ఉగ్రవాది తుపాకీతో అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో అనంత్‌నాగ్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీపై కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను వెంటనే అనంత్‌నాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ ప్రకటించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు, ఉగ్రవాది కదలికలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి సంబంధించిన కీలక వివరాలను సేకరిస్తున్నారు.
also read :చివరి ప్రయాణంలో ట్విస్ట్.. అసలు విషయం తెలిస్తే షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు