Homeక్రైమ్'ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో చెప్పలేను'.. విద్యార్థి సూసైడ్ నోట్ వెలుగులోకి

‘ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో చెప్పలేను’.. విద్యార్థి సూసైడ్ నోట్ వెలుగులోకి

క్రైం మిర్రర్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటనలో ఆయన రాసిన సూసైడ్ నోట్‌ వెలుగులోకి వచ్చింది. అందులో తన మరణం తర్వాత అవయవాలు ఉపయోగపడే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని, అది సాధ్యం కాకపోతే తన శరీరాన్ని శాస్త్రీయ పరిశోధనలు, వైద్య విద్య కోసం విరాళంగా ఇవ్వాలని కోరడం తీవ్రంగా కలిచివేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తండాకు చెందిన మేతిపోలే శివశంకర్ (20) నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువు నిమిత్తం ముగ్గురు స్నేహితులతో కలిసి నర్సాపూర్ పట్టణంలోని ఓ అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం స్నేహితులు బయటకు వెళ్లిన సమయంలో గదిలో ఒంటరిగా ఉన్న ఆయన ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనకు ముందు తన స్నేహితుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంపిన సూసైడ్ నోట్‌లో ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమేనని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనకు అండగా నిలిచారని, వ్యక్తిగతంగా ప్రేమ వ్యవహారం వంటి కారణాలు లేవని, తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానో వివరించలేనని అందులో రాశాడు.

అలాగే, తన మరణం తర్వాత అవయవాలు మార్పిడి చేయగలిగే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని, లేకపోతే తన శరీరాన్ని వైద్య విద్య, శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగించాలని కోరాడు. జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం ఉందని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

read also : ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ గా భోగాపురం ఎయిర్ పోర్టు…! సీఎం చంద్ర‌బాబు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు