జైలు జీవితం అనుభవిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించిన ప్రేమకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి లభించింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా, పురుష ఖైదీలు వివాహం చేసుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జైలు ప్రాంగణంలోనే వారి వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మూలారామ్, సీమా ఘడ్సేలకు ఈ అరుదైన అవకాశం దక్కింది. జైలు ఆధ్వర్యంలో నిర్వహించే పనుల్లో భాగంగా పొలాల్లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
మూలారామ్ ఓ హత్య కేసులో 2017 నుంచి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మరోవైపు సీమా ఘడ్సే కూడా ఓ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తోంది. తమ వివాహానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వీరిద్దరూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టప్రకారం వివాహం చేసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది. ఈ మేరకు పెళ్లికి అనుమతి మంజూరు చేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం భద్రతా ఏర్పాట్ల మధ్య జులై 22న వీరి వివాహం జరగనుంది. వివాహ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి పరిమిత సంఖ్యలో సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పెళ్లి ఖర్చులను కూడా ఖైదీల కుటుంబాలే భరించాల్సి ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ జంటకు కోర్టు ఇచ్చిన అనుమతి ఆసక్తికరంగా మారింది.
also read: ముర్షిదాబాద్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి, పలువురు విద్యార్థులకు గాయాలు