పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సును రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సమయంలో విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద ధాటికి బస్సులో ఉన్న విద్యార్థులు గాయాలపాలయ్యారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదానికి అసలు కారణాలపై రైల్వే అధికారులు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే క్రాసింగ్ వద్ద భద్రతా చర్యలు సరిగ్గా అమలయ్యాయా? సిగ్నలింగ్ వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
ప్రత్యక్ష సాక్షుల తెలిపిన దాని ప్రకారం.. బస్సు రైల్వే పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతులు మరియు గాయపడిన విద్యార్థుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
also read: హైదరాబాద్‌లో బాలికపై ఘాతుకం.. స్కూల్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అత్యాచారం.. నిందితుడు అరెస్ట్