ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌పై మరోసారి అప్రమత్తత మొదలైంది. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో కోవిడ్ లక్షణాలతో ఓ వ్యక్తి రావడంతో వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు.
బుధవారం కోవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతడిని హోం ఐసోలేషన్‌కు పంపించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డును సిద్ధం చేశారు. అనుమానిత కేసులకు వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు, చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన సందర్భాల్లో మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
also read: కన్న కొడుకును కడతేర్చిన తల్లి- మత్తు పదార్థాలకు బానిసైన కొడుకు వేధింపులు తాళలేక హత్య…