ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో భారత్ 0-3తో వెనుకబడింది. ఇవాళ జరిగే చివరి టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. లేకపోతే మరో సిరీస్ లో కూడా వైట్‌వాష్ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ఇంగ్లండ్‌పై కూడా వరుస పరాజయాలు ఎదురవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. 2019 తర్వాత వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోయే పరిస్థితి రావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. బ్యాటింగ్‌లో భారత జట్టు ఆశించిన ప్రదర్శన చేయలేకపోతోంది. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఇంగ్లండ్ పిచ్‌లపై అదనపు బౌన్స్, నెమ్మదిగా ఉండే వికెట్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. యువ ఆటగాడు వైభవ్‌కు వరుస అవకాశాలు ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా నిలకడగా రాణించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రమే కొంత మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో మెరిసిన భారత బ్యాటర్లకు ఇంగ్లండ్ పరిస్థితులు కఠిన పరీక్షగా మారాయి. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మెరుగైన ఆటతీరు కనబరిస్తేనే భారత్ విజయాన్ని అందుకోగలదు. లేదంటే ఈ సిరీస్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధిపత్యంలో ముగిసే అవకాశం ఉంది.
అంచనా జట్లు
భారత్: అభిషేక్ శర్మ, వైభవ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్/సూర్యాంశ్, అక్షర్ పటేల్, ప్రిన్స్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.