క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు అయిన యూట్యూబర్ రావణ్ మెడకు ఉచ్చు బిగించుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల రావణ్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా స్టేషనులకు చెందిన పోలీస్ అధికారులు అతడిని అరెస్టు చేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో స్టేషన్లో నమోదైన కేసు పై అరెస్టు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో రావణ్ పై కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు అరెస్టు చేయగా, కోర్టులో బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా రావన్న ఐదోసారి కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపిఎ – ఉపా) కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు ఈనెల 18 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటివరకు వివిధ సెక్షన్ల కింద రావణ్ పై కేసులు నమోదు చేశారు. శనివారం సాయంత్రం ఆయన్ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమాచారాన్ని ఆయన భార్యకు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రావణ్ కు పోలీసులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ కేసు తర్వాత కూడా మిగిలిన ప్రాంతాల్లోనూ ఆయన పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పలుమార్లు దాడి చేసేందుకు కొన్ని పోలీస్ స్టేషన్లో వద్ద జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రాంతాల్లోనూ ఆయన పై కేసులు నమోదు చేయడం ద్వారా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియోలో విద్వేష ప్రసంగాలంటూ కోర్టుకు తెలిపిన లాయర్..
ప్రశ్న చానల్లో రావణ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పోలీసులు తరఫు న్యాయవాది, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం రాత్రి కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రావణ్ ఇప్పటివరకు 5,100 వీడియోలను తన యూట్యూబ్లో అప్లోడ్ చేశారని, మావోయిస్టు నేతలు హెడ్మా, కే సాంబయ్య ను ఎన్కౌంటర్ చేసిన తర్వాత యువతను, విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ లాయర్ వాదనలు వినిపించారు. వారిద్దరూ చనిపోయిన మరింతమంది హెడ్మాలు, సాంబయ్యలు పుడతారని విశ్లేషణ చేశాడంటూ వెల్లడించారు. రావణ్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. అవన్నీ ఏఐ ఆధారిత సృష్టి కల్పన వీడియోలుగా పేర్కొన్నారు. ఇకపోతే రావన్ను తీసుకెళ్తున్న ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తును మోహరిస్తున్నారు. అతనిపై దాడి చేసేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండడంతో పోలీసులను గట్టిగా మోహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపోతే తాజాగా రావణ్ పై పాలకొండ, సాలూరు పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి చెందిన నాయకులు అతడిపై కేసులు నమోదు చేశారు.