Crime Mirror, AP State News: విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా గరివిడిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా తొండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22) అదే గ్రామానికి చెందిన వివాహితుడు రామనాయుడుతో కొన్నేళ్లుగా పరిచయం ఉంది.
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే యువతకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ వస్తున్నారు. తాజాగా యువతికి పెద్దలు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు. పెద్దలు కుదిరిచిన వ్యక్తితో గురువారం నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియడంతో అఖిలను రామనాయుడు బెదిరించడం ప్రారంభించాడు.
నువ్వు మరో పెళ్లి చేసుకుంటే అందరికీ మన విషయాన్ని చెప్పేస్తానని భయపెట్టాడు. దీంతో తీవ్రంగా భయాందోళన చెందిన యువతి ఎవరికి చెప్పవద్దు అంటూ రామనాయుడును వేడుకుంది. అయినప్పటికీ రామనాయుడు వినకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
-
చావకపోతే పెళ్లి చెడగొడతానని బ్లాక్ మెయిల్..
యువతికి పెళ్లి నిశ్చయం కావడానికి సహించలేకపోయిన రామనాయుడు ఎలా అయినా దానిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే అఖిలను పిలిపించి పెళ్లి సంబంధం చెడగొట్టుకోవాలని చెప్పినట్లు తెలిసింది. నువ్వు చావకపోతే మన విషయం చెప్పి పెళ్లి చెడగొడతా అని ఈ క్రమంలోనే రామనాయుడు అఖిలను బెదిరింపులకు గురిచేసాడు.
ఇంట్లో తెలిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన అఖిల.. రాము నాయుడు ఇచ్చిన పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి మంగళవారం అపస్మారక స్థితిలోకి అఖిల వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా అఖిల మృతి చెందింది.
చికిత్స పొందుతున్న సమయంలోనే గరివిడి పోలీసులు అన్ని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ లోకేశ్వరరావు వెల్లడించారు.
ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఏ కారణాల వల్ల యువతిని రామనాయుడు బెదిరించాడు అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజా ఘటన పట్ల గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే, రాము నాయుడు కూడా విషం తీసుకుని ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు. దీనిపై పోలీసులు మాత్రం స్పందించడం లేదు.