క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు మాజీలు, రిటైర్డ్, కీలక ఉన్నతాధికారులకు భద్రత, వాహనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సెక్యూరిటీ రివ్యూ చేపట్టిన అధికారులు.. ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్‌లు, కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులకు ఇప్పటివరకు కల్పిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను తొలగిస్తూ.. పోలీస్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కొంతమంది అధికారులు, మాజీ అధికారులకు సెక్యూరిటీని కూడా తగ్గించింది.
ఏకంగా 100 మంది అధికారులకు సెక్యూరిటీ, వాహనాలను తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మతో పాటు పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ చంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా వంటి మాజీ ఉన్నతాధికారులకు వాహనాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్‌తో పాటు కొంతమంది ప్రస్తుత ఉన్నతాధికారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఈ మార్పులు వర్తించనున్నాయని పేర్కొన్నారు.
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలతో పాటు మాజీ డీజీపీలకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనాలను కూడా వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. మరోవైపు.. పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఉన్నతాధికారులకు కేటాయించిన గన్మెన్ల సంఖ్యను కూడా తగ్గించారు. ఎక్కువ మందికి 1+1 భద్రతా విధానం (ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్/సహాయకుడు) మాత్రమే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నక్సలిజం ప్రభావం భారీగా తగ్గిపోవడం.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తాజా భద్రతా నివేదికలు.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంద మందికి పైగా వీఐపీలకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించి.. అవసరమైన వారికి మాత్రమే స్పెషల్ సెక్యూరిటీని కొనసాగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.