దశాబ్దాలుగా ఉద్రిక్తతలతో కొనసాగుతున్న భారత్–పాకిస్తాన్ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. రెండు దేశాలకు చెందిన 117 మంది ప్రముఖులు సంయుక్తంగా ముందుకొచ్చి, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కీలక లేఖను పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జమ్మూ కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం, సరిహద్దు చొరబాట్లు వంటి అంశాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని భావించిన ప్రముఖులు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ఈ లేఖను భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు విడివిడిగా పంపించారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంభాషణలను పునఃప్రారంభించి, సంబంధాలను మళ్లీ బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖపై భారత్ నుంచి 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఇందులో భాగస్వామ్యులయ్యారు. భారత్ తరఫున ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, మణిశంకర్ అయ్యర్, మనోజ్ ఝా, మాజీ ‘రా’ చీఫ్ ఏఎస్ దులాత్ వంటి ప్రముఖులు ఉండగా, పాకిస్తాన్ నుంచి ఖుర్షీద్ మహమూద్ కసూరి, అష్రఫ్ జహంగీర్ కాజీ, పర్వేజ్ హూద్‌భాయ్ వంటి ప్రముఖులు సంతకం చేశారు.
ఈ లేఖలో పలు కీలక సూచనలు చేయబడ్డాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో హైకమిషనర్లను తిరిగి నియమించడం ద్వారా పూర్తి స్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం వీసా సేవలను మళ్లీ ప్రారంభించి, సాంస్కృతిక మరియు మతపరమైన పర్యటనలను సులభతరం చేయాలని కోరారు.
అదేవిధంగా కాశ్మీరీ పండిట్లకు అత్యంత పవిత్రమైన శారదా పీఠాన్ని భక్తుల దర్శనార్థం తెరవాలని విజ్ఞప్తి చేశారు. మీడియాపై ఉన్న పరిమితులను సడలించి, జర్నలిస్టులు ఇరు దేశాల్లో స్వేచ్ఛగా పర్యటించి వార్తలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రపంచ జనాభాలో గణనీయమైన వంతు భారత్, పాకిస్తాన్ దేశాల్లోనే నివసిస్తుండగా, ఇరు దేశాల్లో యువత శాతం అధికంగా ఉంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంయుక్త ప్రయత్నం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, భద్రతలను స్థాపించడం మరియు ప్రజల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు నిర్మాణాత్మకంగా స్పందిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
also read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ వీసా మోసం… ఒమన్ ప్రయాణానికి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు!