క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ శివార్లలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న సామాన్య జనాల ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. రోజురోజుకూ ఇక్కడ పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్త, కాలుష్యం కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లోని కార్మిక నగర్‌లో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఉచిత వైద్య శిబిరం వేదికగా.. వారు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యలు బయట పడ్డాయి. అయితే ఈ లెక్కలు చూసిన నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
కార్మిక నగర్ హెల్త్ క్యాంపులో కేవలం 150 మంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 51 మంది వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. బాధితుల్లో అత్యధికులు శ్వాసకోశ, చర్మ వ్యాధుల బారిన పడ్డారు. ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నాయనే అనుమానంతో 26 మందికి ప్రత్యేక పరీక్షలు చేయగా.. వారిలో 16 మందికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఇతర తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తేలింది. అయితే ఇందులో వృద్ధులే కాకుండా చిన్న వయసు వాళ్లు కూడా ఉండడం గమనార్హం. డంపింగ్ యార్డు నుంచి నిరంతరం వెలువడే దుమ్ము, విషపూరిత కెమికల్ వాయువుల వల్లే వీరికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి.
దీనికి తోడు మరో 35 మంది తీవ్రమైన చర్మ వ్యాధులతో నరకం అనుభవిస్తున్నారు. దాదాపు 351 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లోని 15 నుంచి 18 కాలనీల్లో సుమారు 25 వేల మందికి పైగా నిరుపేద, మధ్యతరగతి జనాభా నివసిస్తున్నారు. జవహార్ నగర్, దమ్మాయిగూడ, కార్మిక నగర్, బాలాజీనగర్, గబ్బిలాంపేట, అంబేద్కర్ నగర్, మల్కారం, రాజీవ్ గాంధీ నగర్, ప్రగతి నగర్, నాగారం, రాంపల్లి ప్రాంతాలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దారుణం ఏంటంటే.. సాయంత్రం కాగానే ఈ చెత్త దుర్వాసన యాప్రాల్, సైనిక్‌పురి, ఈసీఐఎల్ వంటి సంపన్న కాలనీలకు కూడా పాకుతోంది. దీంతో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ఇక్కడి నిరుపేదలు కనీసం ప్రైవేట్ ల్యాబ్‌లలో టెస్టులు కూడా చేయించుకోలేక బాలాజీనగర్ హెల్త్ సెంటర్ ఇచ్చే చిన్నచిన్న టాబ్లెట్లతో కాలం వెళ్లదీస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కడతామన్న హామీ కేవలం కాగితాలకే పరిమితమైంది. సుమారు 40 రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం అనంతరం మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి హంగామా చేశారు. వ్యర్థాల నిర్వహణ చూసే ‘రాంకీ’ సంస్థ కాలుష్య నియంత్రణలో పూర్తిగా విఫలమైందని నిలదీశారు. యార్డులోని మురుగు నీటిని శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోవడాన్ని కూడా గుర్తించారు. నిధులను స్థానిక ప్రజల తాగునీరు, వైద్యానికి వాడాలని ఆదేశించినా.. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో రూపాయి మార్పు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చుట్టుపక్కల ఉన్న 25 వేల మందికి ఉచితంగా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.