అనంతపురం, క్రైమ్‌మిర్రర్: బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని అనంతపురం, పెనుకొండ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్న స్థిరాస్తి మార్కెట్ ఈ జూన్ నెలలో మళ్లీ ఊహించని రీతిలో పుంజుకుంది. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలు, పారిశ్రామిక విధానాలపై స్పష్టత రావడంతో పారిశ్రామిక జోన్ల సమీపంలో ల్యాండ్ మార్కెట్ ఒక్కసారిగా క్రయవిక్రయాలతో బిజీగా మారింది. నిన్నటివరకు నిస్తేజంగా కనిపించిన వెంచర్లు, ల్యాండ్ కన్వర్షన్ ప్రాజెక్టులు ఇప్పుడు మదుపరుల రాకతో మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.ఈ మార్కెట్ రికవరీకి ప్రధాన కారణం ఇక్కడి పారిశ్రామిక రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలేనని జిల్లా పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read:పశ్చిమ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం…15 మంది…!
కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలతో పాటు, కొరియన్ కంపెనీల విస్తరణ, రక్షణ రంగ సంస్థల రాకతో పెనుకొండ, హిందూపూర్, అనంతపురం రూరల్ పరిధిలోని ఇండస్ట్రియల్ హబ్‌లలో కొత్త ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్న పారిశ్రామిక కార్మికులు, టెక్నీషియన్లు, ఉన్నతాధికారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఈ ఉద్యోగుల వలసల కారణంగా పెనుకొండ టౌన్ , నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న పరిసర గ్రామాల్లో ఇండ్ల అద్దెలకు పరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లతో పాటు బ్యాచిలర్ రూమ్‌ల కోసం కంపెనీలు ముందస్తుగా అగ్రిమెంట్లు చేసుకుంటుండటంతో ఇండ్ల యజమానులకు మంచి అద్దెలు లభిస్తున్నాయి.
Also Read:మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ భేటీ…! పులుల సంరక్షణ పై చర్చా….
ఇదే సమయంలో, ఇండస్ట్రియల్ జోన్లలో పనిచేసే మధ్యతరగతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని రియల్టర్లు చిన్న ప్లాట్ల విక్రయాలను ముమ్మరం చేశారు.తక్కువ బడ్జెట్‌లో, సులభ వాయిదాల పద్ధతిలో దొరికే 100 నుంచి 150 చదరపు గజాల ప్లాట్ల కొనుగోళ్లకు ఇక్కడి స్థానిక ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. డీటీసీపీ అనుమతులున్న వెంచర్లలో శరవేగంగా ప్లాట్లు అమ్ముడవుతుండటంతో, ప్రధాన రహదారుల వెంబడి కొత్త లేఅవుట్ల కసరత్తు మళ్లీ ఊపందుకుంది. బెంగళూరు హైవే కనెక్టివిటీకి తోడు పారిశ్రామిక రంగం ఇస్తున్న ఊపుతో అనంతపురం జిల్లా పారిశ్రామిక బెల్ట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాబోయే రోజుల్లో తిరుగుండదని భావిస్తున్నారు.
Also Read:అల్లూరి జిల్లాలో అమానుషం…! బాలిక చేతులపై అట్లకాడతో వాతలు…