HomeజాతీయంPregnant Woman Death: ఇంట్లో కాన్పు చేయాలనుకున్నారు.. చివరికి ప్రాణమే పోయింది!

Pregnant Woman Death: ఇంట్లో కాన్పు చేయాలనుకున్నారు.. చివరికి ప్రాణమే పోయింది!

తమిళనాడులో ఇంట్లోనే సాధారణ కాన్పు చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదానికి దారితీసింది. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అయితే, వైద్యులు శిశువును సురక్షితంగా బయటకు తీసుకురావడంతో బిడ్డ క్షేమంగా ఉంది.

తిరుప్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శశికళకు గతంలో సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. ఆ సమయంలో వాడిన కొన్ని అల్లోపతి మందుల వల్ల ఆమెకు అలర్జీ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ కారణంగా ఈసారి ఆస్పత్రిలో సిజేరియన్ చేయించకుండా, సాధారణ కాన్పు చేయాలనుకున్నారు. శశికళకు ప్రసవ నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేయడానికి ప్రయత్నించారు. అయితే, పరిస్థితి అనుకున్నట్లు సాగలేదు. కాన్పు సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది.

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెరుందురైలోని ప్రభుత్వ ఈరోడ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రసవాన్ని పూర్తి చేశారు. బిడ్డ సురక్షితంగా జన్మించినప్పటికీ, అధిక రక్తస్రావం కారణంగా శశికళను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా, శశికళ భర్త కొలందైసామిపై హత్య కేసు నమోదు చేశారు. ఇంట్లోనే కాన్పు చేయాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఎవరైనా సూచించారా? లేదా సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూసి అలా ప్రయత్నించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో వైద్యశాఖ అధికారులు కూడా ఈ ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. గర్భిణుల ప్రసవం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలని, ఇంట్లో కాన్పు చేయడానికి ప్రయత్నించడం ప్రాణాలకు ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు