- ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 1900 ఎకరాల భూమి ఖరారు – భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మరో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమి పరిమాణంపై స్పష్టత వచ్చి, మొత్తం 1900 ఎకరాలు అవసరమని అధికారులు నిర్ధారించారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భారత వాయుసేన అవసరాల కోసం సుమారు 1500 ఎకరాలు, పౌర విమానయాన సేవల కోసం మరో 400 ఎకరాలు కేటాయించనున్నారు. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా భావిస్తున్న ఆదిలాబాద్‌లో, సైనిక మరియు పౌర విమాన సర్వీసులను ఒకే ప్రాంగణంలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది.
విమానాశ్రయంలో రెండు టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒకటి వాయుసేనకు, మరొకటి ప్రయాణికుల కోసం. దాదాపు 2.9 కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం చేపట్టనుండగా, సైనిక, పౌర విమానాల రాకపోకలకు అనుకూలంగా డిజైన్ చేయనున్నారు. ఈ రన్‌వే నిర్మాణానికే అధిక భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ ఖర్చు సుమారు రూ.500 కోట్లుగా ప్రాథమిక అంచనా. విమానాల మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ (ఎంఆర్వో), కార్గో సేవలు, హ్యాంగర్ సదుపాయాలు, విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించనున్నారు. అదనంగా, రక్షణ సిబ్బందికి టౌన్షిప్, స్కూళ్లు, శిక్షణ కేంద్రాలు వంటి మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న ఏరోడ్రోమ్ పరిధిలో 370 ఎకరాల భూమి ఉండగా, అదనంగా 1530 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన సుమారు 800 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రక్షణశాఖకు బదిలీ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కేంద్రం దీనికి అనుమతి ఇస్తే, భూ సేకరణ సమస్య కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే భూసేకరణ పరిహారం అంశం ఇంకా క్లిష్టంగా మారింది. అదనపు భూమికి పరిహారం ఎవరూ చెల్లించాలి అన్నది స్పష్టతకు రాలేదు. కేంద్రం నుంచి సహకారం లభిస్తే, రాష్ట్ర ప్రభుత్వం విమాన పార్కింగ్ చార్జీలు, ఇంధనంపై రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని ఈ ప్రాజెక్ట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్గో, ఎంఆర్వో, హ్యాంగర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కేంద్రం సహకారం అందించాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో విమానయాన రంగంలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆదిలాబాద్‌ను భవిష్యత్తులో కీలక హబ్‌గా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ, పరిహారం అంశాలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత ప్రాజెక్ట్‌కు తుది రూపురేఖలు ఖరారు కానున్నాయి.
also read: బంజారాహిల్స్‌లో సెక్స్ రాకెట్ బట్టబయలు.. స్పై కెమెరా కలకలం