క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత, రైళ్లలో క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జరిమానాలను పెంచినట్లు వెల్లడించింది. టికెట్ లేకుండా ప్రయాణించడం నుంచి స్మోకింగ్ చేయడం వరకు వివిధ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు విధించనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా..
రైలు కోచ్‌లు, రైల్వే స్టేషన్లలో ధూమపానం చేయడం ఇప్పటికే నిషేధితమే. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు నిబంధనలను పట్టించుకోకుండా స్మోకింగ్ చేస్తుండటంతో రైల్వే శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇకపై రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేస్తూ పట్టుబడితే రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే ప్రమాదకర పదార్థాలను తీసుకెళ్లేవారిపైనా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు..
మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లేడీస్ కంపార్ట్మెంట్లలో అనధికారికంగా ప్రయాణించే పురుషులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలకు కేటాయించిన బోగీల్లో పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, రద్దీ సమయంలో ఈ బోగీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే అంతే..
టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్యను తగ్గించేందుకు రైల్వే శాఖ జరిమానాలను భారీగా పెంచింది. గతంలో ఉన్న కనీస జరిమానా రూ.250 కాగా, ఇప్పుడు దానిని రూ.500కు పెంచారు. సరైన టికెట్ లేకుండా లేదా తప్పుడు టికెట్‌తో ప్రయాణిస్తే అసలు టికెట్ ధరతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టికెట్ లేని ప్రయాణాలపై కట్టడి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం..
రైళ్లలో అనుమతి లేకుండా వస్తువులు విక్రయించడం, భిక్షాటన చేయడం, ఇతర అక్రమ కార్యకలాపాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, అవసరమైతే జైలు శిక్ష కూడా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. కాబట్టి రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించి జరిమానాల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.