Homeతెలంగాణసర్కారు బడి నుంచి సూపర్ స్కూల్ దాకా… తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గేమ్ ఛేంజర్!

సర్కారు బడి నుంచి సూపర్ స్కూల్ దాకా… తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గేమ్ ఛేంజర్!

ప్రభుత్వ పాఠశాల అంటే ఒకప్పుడు చాలా మందికి సాధారణ విద్య మాత్రమే అందించే స్థలం అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. “తెలంగాణ పబ్లిక్ స్కూల్” అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రభుత్వ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభమైంది.

నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించే విధంగా ఈ పబ్లిక్ స్కూల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్థులకు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ వరకు పూర్తి సదుపాయాలు కల్పిస్తూ, ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడమే కాకుండా, ఆధునిక జీవితానికి అవసరమైన టెక్నికల్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.

ఇక్కడ కేవలం పాఠ్యపుస్తకాల బోధనే కాదు… డిజిటల్ క్లాస్‌రూమ్స్, అత్యాధునిక ల్యాబ్స్, విస్తృతమైన లైబ్రరీలు, హైజీన్ ప్రమాణాలతో కూడిన డైనింగ్ హాల్స్, మెకానికల్ కిచెన్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని జిమ్, ఇండోర్-ఔట్‌డోర్ గేమ్స్, కల్చరల్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు, విద్యార్థుల రాకపోకలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

ఈ కాన్సెప్ట్‌కు తొలి అడుగుగా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పాఠశాలను అభివృద్ధి చేశారు. ఈ స్కూల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో మొత్తం 1,800కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విభాగాల వారీగా విద్య అందిస్తూ, సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు.

చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులను స్కూల్‌కు తీసుకురావడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం, మెరుగైన వసతులు కల్పించడం వల్ల ఈ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఆరుట్లతో పాటు మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్లస్టర్ మోడల్ ద్వారా ఈ విధానాన్ని విస్తరించి, ప్రభుత్వ విద్యను ఒక ఆదర్శంగా నిలపాలనేది సంకల్పం. ప్రైవేటు విద్యపై ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తూ, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రణాళిక అసలు లక్ష్యం. ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త దిశ విద్యా రంగంలో కీలక మార్పుకు నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

also read: ఇంట్లో వైఫై స్లోగా ఉందా…? అయితే ఇలా చెయ్యండి…!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు