కాకినాడ, క్రైమ్‌మిర్రర్: నిశ్శబ్దంగా ఉన్న ఆ పామాయిల్ తోటలు ఇప్పుడు ఒక తీరని వేదనను, అంతుచిక్కని మిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. కన్నవారి కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం 35 నిమిషాల గ్యాప్‌లో ఆ పసిపాప ఎటు వెళ్లింది. ప్రాణ స్నేహితుడిలా వెంట వెళ్లిన పెంపుడు కుక్క మౌనంగా తిరిగి వచ్చి ప్రాణాలు ఎందుకు వదిలింది? అనే ప్రశ్నలకు సమాధానాలు చిక్కడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్. అగ్రహారంలో జూన్ 6న మొదలైన ఈ అన్వేషణ… నేటికి ఓ కొలిక్కి రావడం లేదు. డ్రోన్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, వందలాది మంది పోలీసులు రంగంలోకి దిగినా ఫలితం శూన్యం. ఈ క్రమంలో పోలీసులు చేస్తున్న ఒక వింత ప్రయోగం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాపను అడవి జంతువులు ఏమైనా తీసుకెళ్లాయా అనే కోణంలో మాంసం నింపిన బొమ్మలతో ఆపరేషన్ మొదలు పెట్టారు.
Also Read:యువతను కాంగ్రెస్ నిలువునా ముంచింది: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు
జూన్ 6వ తేదీన తల్లిదండ్రులు గణేష్, భవానితో కలిసి పామాయిల్ తోటకు వెళ్లింది చిన్నారి జ్ఞానేశ్వరి. తల్లిదండ్రుల మధ్య జరిగిన సమన్వయలోపం కారణంగా ఆ పసిపాప ఒంటరిగా మిగిలిపోయింది. పోలీసులు నిర్దారించిన దాని ప్రకారం సరిగ్గా 35 నిమిషాల వ్యవధిలో బాలిక మాయమైంది. సమాచారం అందిన వెంటనే యంత్రాంగం అలెర్ట్ అయినప్పటికీ, ఆ దట్టమైన తోటల్లో పాప ఆచూకీ దొరకలేదు. ఈ కేసులో అత్యంత విషాదకరమైన, మిస్టరీగా మారిన అంశం వారి పెంపుడు కుక్క. పాపా వెంట వెళ్లిన ఈ కుక్క జూన్ 9న ఒంటరిగానే ఇంటికి చేరింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆహారం తీసుకోకుండా వింతగా ప్రవర్తించింది. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పాపా ఎక్కడ ఉందో కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
Also Read:Bride Death Case: భార్యపై అనుమానం.. సీసీటీవీలతో నిఘా.. పెళ్లై రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య!
సుమారు 80 కిలోమీటర్లు ఆ తోటల చుట్టూ తిరిగి ఆ కుక్క, చివరకు జూన్ 13న మరణించింది. వైరల్ ఇన్ఫెక్షన్ లేదా నాలుగు రోజులు ఆహారం లేకపోవడం వల్ల అది చనిపోయి ఉంటుందని భావించారు. పాపను అడవి జంతువులు ఏమైనా ఎత్తుకెళ్లాయా అన్న అనుమానంతో అధికారులు ఒక షాకింగ్ ఆపరేషన్ చేపట్టారు. తోటలో ఒక ఇనుప బోను ఏర్పాటు చేసి అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల లోపల మాంసం ముక్కలను నింపి, జంతువులను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. దీనికి తోడు చుట్టూ కెమెరా ట్రాప్లను పెట్టారు. వన్యమృగాల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎన్డీర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు అధునాతన డ్రోన్లతో తోటలను జల్లెడ పడుతున్నారు. అడవితోపాటు సమీపంలోని సంచార జాతుల పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. డీఎస్పీ తిలక్ స్వయంగా ఈ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ వార్తలపై పోలీసులు సీరియస్ అయ్యారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్‌గా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.