Homeఆంధ్ర ప్రదేశ్తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభిమాని కోరిక నెరవేర్చనున్న జనసేనాని

తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభిమాని కోరిక నెరవేర్చనున్న జనసేనాని

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రేపు పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన యువ అభిమానిని కలిసి అతని చివరి కోరికను తీర్చేందుకు వరంగల్‌కు రానున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో , ఆ తర్వాత జరిగిన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివాన అయిన సమయంలో పవన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హనుమకొండకు చెందిన 16 ఏళ్ల యువకుడు నిరంజన్ జన్యుపరమైన డీఎండీ వ్యాధితో గత 8 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బాల్యంలో సాధారణంగా ఉన్న అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయి, పూర్తిగా మంచానికి పరిమితమైపోయాడు. ఇటీవల టీవీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటం చూసిన నిరంజన్, సీఎం రేవంత్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్‌ను కలవాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఈ విషయం జనసేన నేతలు, అభిమానుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. మానవతా దృక్పథంతో ఆ కోరికను మన్నించిన పవన్ కళ్యాణ్, రేపు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి అతనిని పరామర్శించనున్నారు. ఆ తర్వాత వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా స్వాగతించటానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. భద్రతా దృక్పథంతో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో జనసేన మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ వివాదం ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు