క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : లక్షల్లో జీతం, ఏసీ గదుల్లో కొలువు, సమాజంలో పెద్ద హోదా.. సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే యువత కలలు ఇవే. కానీ.. ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి, సంతోషం లేకపోతే ఆ జీవితం వ్యర్థమని భావించేవారు కొందరే ఉంటారు. ప్రస్తుత మన సమాజంలో సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతల మధ్య తమ మనసుకు నచ్చిన ప్యాషన్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం చాలా అరుదు. అలాంటి ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుని కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్ అయిన చేతనా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చేతనా సింగ్ ఒక క్యాబ్‌లో ప్రయాణిస్తూ.. డ్రైవర్ కుమార్ గురించి వివరాలు అడిగి వీడియోను రికార్డ్ చేశారు. కుమార్ ఊబెర్ సంస్థలోనే అత్యధిక రేటింగ్ కలిగిన టాప్ డ్రైవర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ వీడియోలో కుమార్ మాట్లాడుతూ.. తనకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని అందుకే అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని గర్వంగా చెప్పారు. డ్రైవింగ్ వృత్తి ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భిన్నమైన వ్యక్తులతో మాట్లాడే, పరిచయం పెంచుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుందని ఆయన వీడియిలో వివరించారు. అంతేకాకుండా.. కారు నడుపుతూ హైదరాబాద్ వీధులను పూర్తిస్థాయిలో చుట్టేసే వీలు కూడా దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేశారు. 2014లోనే తాను ఈ నిర్ణయం తీసుకున్న కుమార్.. గత పదేళ్లలో దాదాపు 23,600 ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘చాలా ఇన్‌స్పరింగ్ స్టోరీ.. సమాజం ఏమనుకుంటుందో అనే భయాన్ని పక్కనపెట్టి, మనసుకు నచ్చిన పని చేయడంలోనే అసలైన ఆనందం ఉందని నిరూపించారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఈ రీల్ చూశాక.. నేను ఎప్పుడో వదిలేసిన నా పాత ప్యాషన్‌ను మళ్లీ గుర్తుచేసుకున్నాను, థాంక్యూ కుమార్ సార్’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. కార్పొరేట్ ఒత్తిడితో సతమతమవుతున్న నేటి యువతకు కుమార్ జీవిత ప్రయాణం ఒక గొప్ప కనువిప్పుగా నిలుస్తోందని అంటున్నారు.
అమెజాన్ ఉద్యోగం వదిలేసి.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన టెకీ, కారణం తెలిసి నెటిజన్లు ఫిదా!!
By Crime Mirror
0
33