Homeతెలంగాణమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి భారీ షాక్.. వినియోగదారుల కమిషన్ జరిమానా!!

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి భారీ షాక్.. వినియోగదారుల కమిషన్ జరిమానా!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యానికి హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ గట్టి షాక్ ఇచ్చింది. కోర్సు మధ్యలోనే చదువు ఆపేసిన ఒక విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్లను తిరిగి ఇవ్వకుండా.. అదనపు ఫీజు డిమాండ్ చేస్తూ వేధించినందుకు గాను పెద్ద ఎత్తున జరిమానా విధించింది. కాలేజీ వైఖరి వల్ల విద్యార్థి విలువైన విద్యా సంవత్సరాలు నష్టపోవడమే కాకుండా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొంటూ.. ఇందుకు బాధ్యతగా సదరు విద్యార్థికి రూ.1 లక్ష నష్ట పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరోరూ.10,000 అదనంగా చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన రాకేష్‌ వర్మ కుమారుడు 2021 అక్టోబరులో మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్‌ లెర్నింగ్‌) కోర్సులో అడ్మిషన్ పొందాడు. మొదటి సంవత్సరానికి గానూ ట్యూషన్‌ ఫీజు కింద రూ.80,000 కాలేజీకి చెల్లించారు. ఆ సమయంలోనే విద్యార్థికి చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కాలేజీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. మొదటి సెమిస్టర్‌ పూర్తి కాగానే సదరు విద్యార్థి చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఉపాధి లేదా ఇతర ప్రత్యామ్నాయాల కోసం తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని విద్యార్థి, అతని తండ్రి కాలేజీ యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. మిగిలిన కోర్సు కాలానికి సంబంధించి అదనంగా ఇంకొక రూ.80,000 చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే కుదరదని పట్టుబట్టింది. కాలేజీ చేసిన ఈ డిమాండ్ వల్ల సర్టిఫికెట్లు చేతిలో లేక ఆ విద్యార్థి ఏకంగా నాలుగు విద్యా సంవత్సరాల పాటు విలువైన కాలాన్ని నష్టపోవాల్సి వచ్చింది.  అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్లకు లొంగని విద్యార్థి.. గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయ పోరాటానికి దిగారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. మల్లారెడ్డి కాలేజీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు అందగానే ఉలిక్కిపడిన కాలేజీ యాజమాన్యం.. తక్షణమే సదరు విద్యార్థి సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చేసి, తమపై ఉన్న కేసును కొట్టేయాలని కమిషన్‌ను అభ్యర్థించింది. అయితే యాజమాన్యం చేసిన తప్పును, దానివల్ల విద్యార్థి అనుభవించిన వేదనను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కాలేజీ బాధ్యతారహిత వైఖరి వల్లే విద్యార్థి భవిష్యత్తు నష్టపోయిందని స్పష్టం చేస్తూ.. సంచలన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా రూ.1.10 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా తీర్పు వచ్చిన 45 రోజుల్లోగా మొత్తం రూ.1.10 లక్షలను బాధితుడికి చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని కమిషన్ కాలేజీ యాజమాన్యాన్ని కఠినంగా హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు