కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ పేరు అమేథీ జిల్లాలోని పంచాయతీ ఓటర్ల జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో ఆమె పేరు కనిపించకపోవడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
2019లో రాహుల్ గాంధీని ఓడించిన స్కృతి
స్మృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి అమేథీ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 2019 నుంచి 2024 వరకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో అమేథీ జిల్లా గౌరీగంజ్ అసెంబ్లీ పరిధిలోని మైదాన్ మైవా గ్రామంలో ఆమె ఒక ఇంటిని నిర్మించుకున్నారు. అదే గ్రామంలో ఓటరుగా కూడా తన పేరును నమోదు చేయించుకున్నారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలోనూ, 2024 లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితాలోనూ స్మృతి ఇరానీ పేరు నమోదై ఉంది. అంతేకాకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచే తన ఓటు హక్కును వినియోగించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు.
గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు మిస్
ఇటీవల జూన్ 10న గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. అందులో స్మృతి ఇరానీ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ అంశంపై స్పందించిన అమేథీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్, విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత పేరు ఎందుకు తొలగించబడిందనే విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు.
మరోవైపు బీజేపీ అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాన్షు శుక్లా మాట్లాడుతూ, స్మృతి ఇరానీ పేరు పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఇప్పటికే దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆమె పేరును జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం అమేథీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.