ఒడిశాలో ఓ యువతి హత్య కేసు సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రేయసిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రమాదంలా కనిపించేలా కథ అల్లినా, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.
అసలేం జరిగిందంటే?
గంజాం జిల్లాకు చెందిన రాకేశ్ ఆచార్య, అంబిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంబిక నీట్ పరీక్షకు సిద్ధమవుతూ బెర్హంపూర్‌లో ఉంటోంది. ఈ క్రమంలో తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని ఆమె భావించింది. అయితే, రాకేశ్ మాత్రం ఏదో ఒక కారణం చెబుతూ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. అయినప్పటికీ అంబిక పెళ్లి విషయంపై తరచూ మాట్లాడుతుండటంతో అతడు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకపోవడంతో అంబికను శాశ్వతంగా దూరం చేయాలని రాకేశ్ నిర్ణయించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ 7న సరదాగా బయటకు వెళ్దామని చెప్పి అంబికను తన బైక్‌పై గోపాల్‌పూర్‌కు తీసుకెళ్లాడు. రోజంతా కలిసి గడిపిన తర్వాత రాత్రి తిరుగు ప్రయాణంలో అంకులి ఓవర్ బ్రిడ్జి వద్ద బైక్ ఆపాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో అంబికను ఓవర్ బ్రిడ్జి పైనుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశాడు. యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదంలో అంబిక మరణించిందని చెప్పి నమ్మించేందుకు ప్రయత్నించాడు.
కుటుంబ సభ్యులకు అనుమానం
అయితే, రాకేశ్ చెప్పిన వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులు సరిపోకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో ఇది ప్రమాదం కాదని తేలింది. అనంతరం సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి రావడంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించగా, కేసు విచారణ కొనసాగుతోంది.