కర్నూలు, క్రైమ్‌మిర్రర్: కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. టీజీ భరత్, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మధ్య మొదలైన వివాదంలోకి టీజీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. సిద్ధార్థ్ రెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలంటూ టీజీ వెంకటేష్ పరోక్షంగా హెచ్చరించారు. ఆయన తాత తనకు బాగా పరిచయమని.. ఆ పరిచయంతోనే మంచిగా మాట్లాడేది నేర్చుకోమని చెప్తున్నానని సలహా ఇచ్చారు. ఇలాగే మాట్లాడితే తాము ఊరుకున్నా.. తమ కార్యకర్తలు నాలుక కట్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.రాయలసీమ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి, టీజీ కుటుంబానికి మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్సెస్ టీజీ భరత్ గా మొదలైన కర్నూలు రాజకీయం.
ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ఇందులోకి మంత్రి టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. టీజీ భరత్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య మొదలైన ఈ సవాళ్లు- ప్రతి సవాళ్లలోకి టీజీ వెంకటేష్ ప్రవేశించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎగిరెగిరి పడినవాళ్లంతా చల్లారిపోయారని.. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని టీజీ వెంకటేష్ హెచ్చరించారు. “కొంతమంది అప్పుడప్పుడూ ఎగిరిపడుతుంటారు. ఇటీవలే ఒకడు ఎగిరిపడ్డాడు. ఆ అబ్బాయికి సంవత్సరం కిందటే ఓసారి మాటల్లో చెప్పా. నీ పేరు అందరికీ తెలిసింది. భవిష్యత్తు బాగుంటుంది. జాగ్రత్తగా మాట్లాడి, నోరుపారేసుకోకుండా బాగా మాట్లాడేది నేర్చుకోమని చెప్పా. ఎక్కడో వారిపై ప్రేమ ఉండేది. ఎందుకంటే వాళ్ల తాత నాకు క్లోజ్.
చాలా సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నాం. ఆ పరిచయాలతోనే చెప్పా. కుటుంబంలో నికృష్టుడు పుడుతుంటారు. మంచి కుటుంబాల్లోనూ దరిద్రులు పుడుతుంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పే విధానాలు వేరుగా ఉంటాయి. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు ఇలా చూస్తాం.”” రాయలసీమలో మీసాలు తిప్పుకున్నోళ్లంతా, మీసాలు దింపుకుని మాతో సహకరించారు. ఏదో వందమంది రౌడీలను వేసుకుని ఎగిరిపడుతున్నారు. ఆ పిల్లోడికి చెప్పేదొక్కటే. వాళ్లు 100 మందిని తెస్తే మేము వేయిమందిని తెస్తాం. వాళ్లు వేయిమందిని తెస్తే మేము పదివేల మందిని తేగలం.. 10 వేల మందిని తెస్తే.. లక్ష మందిని తెస్తాం. వాళ్లు లక్ష రూపాయలు ఖర్చుచేస్తే.. నేను కోటి రూపాయలు ఖర్చు చేయగలను. నోరు పారేసుకుంటే మేమేమీ చేయకపోయినా.. మా కార్యకర్తలు ఎవరో ఒకరు నాలుక కట్ చేస్తారు.
జాగ్రత్తగా ఉండాలి” అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి టీజీ వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు.కర్నూలు చెందిన సతీష్ అనే దళిత యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సతీష్ కుటుంబానికి ఓ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు అందాయంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించటంతో ఈ వ్యవహారం మొదలైంది. సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని అడుగుతున్నందుకు అధికార పార్టీ తనను బెదిరిస్తోందన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. ఈ క్రమంలోనే టీజీ భరత్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి టీజీ భరత్.. సిద్ధార్థ్ రెడ్డిని జోకర్ అంటూ విమర్శించారు. సిద్ధార్థ్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చిన టీజీ వెంకటేష్.. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.