HomeజాతీయంNarendra Modi: నెహ్రూ రికార్డుకు చెక్.. అత్యధిక కాలం ప్రధానిగా మోదీ అరుదైన ఘనత!

Narendra Modi: నెహ్రూ రికార్డుకు చెక్.. అత్యధిక కాలం ప్రధానిగా మోదీ అరుదైన ఘనత!

ప్రధానమంత్రి పదవిలో నరేంద్ర మోదీ 12 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన, వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారంతో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనుండటంతో, స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉండేది. నెహ్రూ 1952 నుంచి 1964 వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు.

మోదీ అధ్యక్షతన ఎన్‌డీఏ కీలక సమావేశం

ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్‌డీఏ కీలక సమావేశం జరగనుంది. ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భాగస్వామ్య పార్టీల నేతలు, బీజేపీ సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు, ‘వికసిత్ భారత్’ లక్ష్యాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు ఇవే!

ఇదిలా ఉంటే, 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశ అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని చెప్పారు. ఉజ్వల పథకం ద్వారా 10.5 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పీఎం-కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ.4.3 లక్షల కోట్లకు పైగా జమ చేశామని, పంట బీమా కింద భారీ పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. అలాగే రక్షణ రంగంలో భారత ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

మౌలిక వసతుల అభివృద్ధిలో అటల్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, పంబన్ సీ బ్రిడ్జి వంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్ విస్తరణతో పాటు వందే భారత్ రైళ్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు.మహిళలు, యువత సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని, జన్‌ధన్ ఖాతాలు, ముద్ర రుణాలు, లఖ్‌పతి దీదీ వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరిందని మోదీ వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దడమే తమ  లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు