ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద వంటగ్యాస్ సబ్సిడీ పొందుతున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు ఏడాదికి సబ్సిడీతో అందిస్తున్న 9 ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను 4కు తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉజ్వల లబ్ధిదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉజ్వల పథకం లబ్ధిదారులు సగటున సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్యను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంది కుటుంబాలు పూర్తి కోటాను వినియోగించడం లేదనే అభిప్రాయంతో సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదించినట్లు అధికారులు చెబుతున్నారు.
2016లో ఉజ్వల యోజన ప్రారంభం
ఉజ్వల యోజనను కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. పేద కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేశారు. ప్రారంభంలో లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ అందించేవారు. అనంతరం గత ఏడాది ఆ సంఖ్యను 9కు తగ్గించారు. ఇప్పుడు మరోసారి కోత విధిస్తూ 4 సిలిండర్లకే పరిమితం చేశారు. ప్రస్తుతం ఉజ్వల లబ్ధిదారులకు ప్రతి సిలిండర్ పై రూ.300 సబ్సిడీ అందుతోంది. దీంతో వారు ఒక్క సిలిండర్ కు సుమారు రూ.642 మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే, సబ్సిడీ కోటా పూర్తయిన తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
అదనపు భారం పడే అవకాశం
ప్రస్తుతం ఒక ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.942గా ఉంది. అంటే నాలుగు సబ్సిడీ సిలిండర్ల తర్వాత అవసరమైన అదనపు సిలిండర్లను పూర్తిధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ వంటగ్యాస్ వినియోగించే కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గడంతో లబ్ధిదారులు తమ గ్యాస్ వినియోగాన్ని మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఖర్చులపై ఎంత మేర ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.