సూరత్, క్రైమ్ మిర్రర్: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. సూరత్‌లో ఒక సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే పనికి వచ్చిన నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రాథమిక విచారణలోనూ ఇదే తేలిందవి. ఈ దారుణానికి నిర్వహణ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. సూరత్‌లోని అశ్వినీ కుమార్ ప్రాంతంలో జరిగింది.
నగలను శుభ్ర పరిచే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఈ సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళుతుంటాయి. దీనివల్ల అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు విడుదలై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన నలుగురు తీవ్రమైన ఇబ్బందులకు గురై మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా, ఉంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుంటారని, కానీ, ఇప్పుడు ఈ దారుణం జరగడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విష వాయువులు ఉండడమే కారణమని…
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించారు. ఆదివారం ఉదయం సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఒక సూపర్ వైజర్, ముగ్గురు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. లోపలకు వెళ్లిన కొద్దిసేపటికే నలుగురు కుప్పకూలిపోయారు. మూసివేసిన ట్యాంక్ ప్రదేశంలో విషవాయువు ఉండడమే దీనికి కారణమై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శ్వాస ఆడకపోవడం కూడా మృతికి కారణమై ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. స్పష్టమైన కారణాలను కూడా పోలీసులు చెప్పలేకపోతున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ట్యాంకులోకి దిగడానికి ముందు సూపర్ వైజర్ అగ్నిమాపక శాఖ ఽఅధికారులను సంప్రదించినట్టు చెబుతున్నారు. ప్రాథమిక వివరాలు ప్రకారం పనులు నిర్వహించే సమయంలో కార్మికుల వద్ద అవసరమైన భద్రతా పరికరాలు, రక్షణ సామాగ్రి లేనట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ప్రధానంగా నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. భద్రతా విధానాలు అమలు చేశారా.? లేదా.? అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని అధికారులు వెల్లడించారు.