-
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
-
తాగునీరు, పరిశుభ్రత, పచ్చదనం అభివృద్ధికి ప్రాధాన్యత
-
లక్ష్మీదేవిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం –
-
సర్పంచ్ ఎలికట్టి భరత్
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: గ్రామాభివృద్ధే ధ్యేయంగా లక్ష్మీదేవిగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన సుందర గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ ఎలికట్టి భరత్ తెలిపారు. శనివారం వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవిగూడెంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాలకు గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రజల సహకారంతో లక్ష్మీదేవిగూడెంను మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెడతామని స్పష్టం చేశారు.
గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంటా స్వాతి నరసయ్య, ఎంపీఓ. సంగీత, వార్డు సభ్యులు సందీప్, సతీష్, జగన్, జ్యోతి, గ్రామ నాయకులు, రేషన్ డీలర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.