హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెరుగుతున్న తరుణంలో, కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలను రోడ్డుకు ఈడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుండటంతో, అటు కేడర్ తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీలో గత కొంతకాలంగా సాగుతున్న పాత వర్సెస్ కొత్త నేతల వివాదం ఇప్పుడు మరింత ముదిరింది.
తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తీవ్ర ఆరోపణలతో కూడిన పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెనుక కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన కొందరి హస్తం ఉందంటూ ఈటల అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటుండటాన్ని జీర్ణించుకోలేక, వారి మధ్య గ్యాప్ పెంచేందుకే ఈ పోస్టర్ల కుట్రకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది.అయితే, దీనికి కౌంటర్‌గా బండి సంజయ్ అనుచరులు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు.
గతంలో బండిసంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం వెనుక, అలాగే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించేయడం వెనుక పరోక్షంగా ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మరికొందరు నేతల హస్తం ఉందంటూ వారు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల మధ్య పరస్పర పోస్టులు, తీవ్ర విమర్శలు వైరల్ అవుతున్నాయి.“ఈటల ఏడుపే బీజేపీకి శాపం.. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్రమంత్రి పదవి రాలేదని నిరంతరం అసంతృప్తితో ఉంటున్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే… మోడీ ఇమేజ్‌తో కాకుండా తన సొంత ఇమేజ్‌తోనే గెలిచాననడం రాజకీయ నైతికత కాదు. ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు? నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటకు రావాలి.” అని ఈటలపై పోస్టర్లు పెద్దఎత్తున వెలిశాయి.
అయితే, ఈ ఆధిపత్య పోరు వెనుక అసలు కారణం కేంద్ర మంత్రివర్గ విస్తరణే అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. గతంలో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న సమయంలో… తమకు కూడా అవకాశం వస్తుందని ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు ఆశించారు. కానీ బండికి మాత్రమే అవకాశం దక్కడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని, తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ మంత్రి పదవి రేసులో ముందంజలో ఉండాలనే తాపత్రయమే తాజా గ్రూపు రాజకీయాలకు, పరస్పర దుష్ప్రచారాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల లాంటి సీనియర్ నేతను కించపరిచేలా నీచ రాజకీయాలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక నాయకుడిపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణలో బీజేపీ పుంజుకోవడాన్ని చూసి ఓర్వలేక ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రగా వారు అభివర్ణించారు.
రాష్ట్ర బీజేపీ నేతలమంతా ఐక్యంగా ఉన్నామని, ఇలాంటి కుట్రలను తిప్పికొడతామని వారు స్పష్టం చేశారు. నేతలు పైకి ఐక్యత రాగం వినిపిస్తున్నప్పటికీ, లోపల జరుగుతున్న అంతర్గత పోరును కేంద్ర అధిష్టానం ఎలా సర్దుమణిగిస్తుందో వేచి చూడాలి. రైతు భరోసా యాత్రలో కలవని నేతలు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ తర్వాత, రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘రైతు ఘోష – బీజేపీ భరోసా యాత్ర’ అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ యాత్ర.. ఊహించిన దానికంటే.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న అధికార పక్షాన్ని తీవ్రంగా భయపెట్టడంలో విజయవంతమైంది. ఒక ప్రతిపక్ష నేత చేసే యాత్ర ఎంతవరకు ప్రభావం చూపించిందో చెప్పడానికి ప్రభుత్వ స్పందనే కొలమానం.
మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర సృష్టించిన ప్రభావం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహేశ్వర్ రెడ్డి గురి పక్కాగా తగిలిందని అర్థమవుతోంది. యాత్ర సందర్భంగా మహేశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే ఎక్కడ జరిగాయో చూపించండి, నేను నిరూపించడానికి సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి… ఆయన గెలిస్తే నేను
రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా!” అంటూ మహేశ్వర్ రెడ్డి విసిరిన పొలిటికల్ ఛాలెంజ్ కాంగ్రెస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది.ఈ యాత్రకు బీజేపీ అగ్ర నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కకపోయినప్పటికీ.., మహేశ్వర్ రెడ్డి తన వ్యక్తిగత సామర్థ్యంతో, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో ఈ కార్యక్రమాన్ని విజయతీరాలకు చేర్చారు. అలాగే నిస్తేజంగా ఉన్న గ్రౌండ్ కేడర్‌ను యాక్టివ్ చేసి, రైతుల గుండెల్లోకి బీజేపీని తీసుకెళ్లడంలో మహేశ్వర్ రెడ్డి పూర్తిగా కృతకృత్యులయ్యారబెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తన తదుపరి పూర్తి ఫోకస్‌ను తెలంగాణపైనే పెట్టబోతోందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన కార్యక్రమ బాధ్యతను హైకమాండ్ మహేశ్వర్ రెడ్డికి అప్పగించడం వెనుక అధిష్ఠానం ఏదైనా పెద్ద వ్యూహాన్నే అమలు
చేసిందా? అనే టాక్ వినిపిస్తోంది. ఈ యాత్రను ఒక ‘టెస్టింగ్ గ్రౌండ్’ లాగా భావించిన అధిష్ఠానం… రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించడానికి మహేశ్వర్ రెడ్డే సరైన వ్యక్తి అని భావించి ఈ బాధ్యతలు అప్పగించిందా? అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ఈ యాత్రను ఘన విజయం వైపు నడిపించారని పార్టీ భావిస్తోందా? దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ యాత్ర విజయం బీజేపీ క్యాడర్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.