Homeజాతీయంనేను సీఎం కాదు.. ప్రజల సేవకుడిని…తమిళనాడు సీఎం విజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు...!

నేను సీఎం కాదు.. ప్రజల సేవకుడిని…తమిళనాడు సీఎం విజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు…!

చెన్నై, క్రైమ్ మిర్ర‌ర్‌: తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తమిళగ వెట్రి కజగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదని, కేవలం ప్రజల సేవకుడినేనని ఆయన స్పష్టం చేశారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు తనను ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా, సొంత సోదరుడిలా ఆదరించారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రజల ప్రేమ, నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రతి నిర్ణయం ప్రజల మేలుకోసమే ఉంటుందని హామీ ఇచ్చారు.

అదే సమయంలో తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై విజయ్ తీవ్రంగా స్పందించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం రాజకీయంగా సాధారణమని.. కానీ విపక్షాలు కనీసం ఆరు రోజులు కూడా ఓపిక పట్టలేదని మండిపడ్డారు. పదవిలోకి వచ్చిన వెంటనే విమర్శలు మొదలుపెట్టడం బాధాకరమన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక తన వ్యక్తిగత విషయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ వ్యాఖ్యానించారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌పైనా విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను బ్లాక్ అండ్ వైట్ దుస్తులు ధరించడం తప్పా అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

తనను మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో పోల్చడం సరికాదని కూడా విజయ్ పేర్కొన్నారు. ఎంజీఆర్ ప్రత్యేకమైన నాయకుడని, ఆయనతో పోలికలు వద్దని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడికి తనదైన ప్రయాణం ఉంటుందని అన్నారు.

రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పోటీ తమిళగ వెట్రి కజగం, ద్రావిడ మున్నేట్ర కజగం మధ్యే ఉంటుందని విజయ్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు