మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందనే వార్తలతోనే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్లో మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మరింత ఆసక్తి పెంచుతోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందట. ముఖ్యంగా చివర్లో వచ్చే కీలక సన్నివేశంలో హీరో నారా రోహిత్ గెస్ట్ రోల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక సినిమాలో చిరంజీవి పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈసారి పాత్రలో మరింత ఎమోషన్, పలు షేడ్స్ కనిపించేలా దర్శకుడు డిజైన్ చేశాడని సమాచారం.
కమర్షియల్ అంశాలతో పాటు కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు బాబీ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారట. చిరంజీవిని కొత్త కోణంలో చూపించాలనే ఆలోచనతో కథను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాంకేతిక విలువలు, నిర్మాణ ప్రమాణాల్లో ఎక్కడా రాజీ లేకుండా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త సినిమా కూడా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక నారా రోహిత్ గెస్ట్ రోల్‌పై వస్తున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.