Homeక్రైమ్Chennai Bar Fight: బార్ లో గొడవ.. ప్రాణాలు పోగొట్టుకున్న 18 ఏళ్ల యువతి!

Chennai Bar Fight: బార్ లో గొడవ.. ప్రాణాలు పోగొట్టుకున్న 18 ఏళ్ల యువతి!

చెన్నైలో జరిగిన ఓ ఘర్షణ విషాదాంతంగా మారి 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. బార్‌లో ప్రారంభమైన చిన్నపాటి గొడవ చివరకు రోడ్డు ప్రమాదానికి దారితీసి ఒక యువతి మృతికి కారణమైంది. మృతురాలు విల్లుపురం జిల్లాకు చెందిన శ్రీలంక శరణార్థి యాన్సీ (18)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే

యాన్సీ తన స్నేహితులతో కలిసి చెన్నైలోని ఓ ప్రైవేట్ బార్‌ కు వెళ్లింది. అక్కడ వారు మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండగా, మరో యువకుల బృందంతో వాగ్వాదం జరిగింది. మొదట మాటామాటా పెరిగి తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బార్‌లో ఉన్న బౌన్సర్లు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీశారు. వారిని శాంతింపజేసి బయటకు పంపించారు. అయితే బార్‌ బయటకు వచ్చిన తర్వాత కూడా వివాదం పూర్తిగా ముగియలేదు. మరోసారి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బౌన్సర్లు మళ్లీ జోక్యం చేసుకుని అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

యువతి బైక్ ను కారుతో ఢీకొట్టడంతో..

బార్ నుంచి యాన్సీ తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కారుతో వారి బైక్‌ ను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కారుపై యాన్సీ స్నేహితులు రాళ్లు విసరడంతో ఆగ్రహించి వారు ఇలా చేశారని కూడా విచారణలో బయటపడుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో యాన్సీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్

ఈ కేసులో బాలమురుగన్ (21), జోశ్వ (19), కిషోర్ కుమార్ (19)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే 18 ఏళ్లలోపు వ్యక్తులను బార్‌లోకి అనుమతించినందుకు సంబంధిత ప్రైవేట్ బార్‌పై కూడా అధికారులు చర్యలు తీసుకుని దానిని సీజ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు