తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2007-08 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఈ పథకాల నిర్వహణలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న జాప్యాలు, పెండింగ్ బకాయిల సమస్యలు తీవ్ర ఆందోళనకు గురిచేయడంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోనుంది. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు ప్రణాళికతో నిధుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త విధానంలో భాగంగా దరఖాస్తుల పరిశీలన, నిధుల విడుదల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చనున్నారు. ముఖ్యంగా “ముందుగా దరఖాస్తు- ముందుగా చెల్లింపు” విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం జిల్లా సంక్షేమ అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేసే విధంగా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ సంక్షేమ శాఖలు తమ ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉండగా, ముఖ్యమంత్రి తుది ఆమోదం అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య గత కొన్నేళ్లుగా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు తదుపరి సంవత్సరంలో విడుదల కావడం, అవి కూడా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల బకాయిలు ఏడాది నుంచి ఏడాదికి పెరుగుతూ వచ్చాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో 5 సంవత్సరాల వరకు పెండింగ్‌లు పేరుకుపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ సహాయంపై ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు ఈ కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కళాశాలల ఒత్తిడిని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2021 నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరుగుతూ వచ్చాయని విద్యాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు రూ.7000 కోట్ల పెండింగ్ బకాయిల భారం లభించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల అంచనాల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలను కలుపుకుంటే మొత్తం పెండింగ్ మొత్తం రూ.10000 కోట్లకు మించి ఉందని చెబుతున్నారు.
బకాయిల చెల్లింపుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు అనేకసార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 2025లో తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో పలు ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించాయి. అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో రూ.1200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు తాత్కాలికంగా విరమించబడ్డాయి. అక్టోబర్ 1, 2025న ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లు విడుదల చేయగా, దసరా సందర్భంగా మరోసారి ఆందోళనలు ఉధృతం కావడంతో అదనంగా రూ.200 కోట్లు విడుదల చేసింది.
అయినప్పటికీ, తాము కోరిన రూ.1500 కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ.500 కోట్లే అందాయని, ఇంకా రూ.10000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా అనేక విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యమవడంతో అనేక మంది విద్యార్థులు తమ సొంతంగా ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చదువు పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలు, బదిలీ ధ్రువపత్రాల జారీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల జోక్యం చేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పెండింగ్ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 24న జరగనుంది. హైకోర్టు సూచనల నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారంపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ప్రతి నెలా నిధుల విడుదల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చర్యలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో విశ్వాసం పెరగడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించే పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ALSO READ: విద్యార్థినులకు ప్రతి నెలా రుతుక్రమ సెలవులు