HomeజాతీయంMamata Banerjee: అభిషేక్‌ పై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి.. బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర...

Mamata Banerjee: అభిషేక్‌ పై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి.. బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు!

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు హంతకుల్లా వ్యవహరిస్తున్నారని, ఇది బీజేపీకి సిగ్గుచేటు అని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో వ్యాఖ్యానించారు.

సోనార్‌పూర్‌ లో అభిషేక్‌ పై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితుడైన సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తానని అభిషేక్ బెనర్జీ ముందుగా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన సోనార్‌పూర్‌కు వెళ్లారు. అయితే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసురుతూ ఆందోళనకు దిగారు. కొందరు అభిషేక్ బెనర్జీపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. దొంగ  అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి సమయంలో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించి ఉండగా, భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన మమతా బెనర్జీ, కనికరంతో కూడిన రాజకీయాలకు, విద్వేష రాజకీయాలకు మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నారు. అలాగే బీజేపీ నేత సువేందు అధికారి హయాంలో బెదిరింపులు, హింస, ప్రతీకార రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు.

ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్న అభిషేక్

మరోవైపు ఈ దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే కొందరు దాడి చేశారని చెప్పారు. ఘటన సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదని కూడా విమర్శించారు. తనపై జరిగిన దాడి విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఘటన అనంతరం అభిషేక్ బెనర్జీని కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు