కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీఎల్పీ సమావేశం అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు సీనియర్ నేతలు డీకే శివకుమార్‌తో కలిసి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు.
జూన్ 3న డీకే ప్రమాణస్వీకారం
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జూన్ 3 తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. శనివారం సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా, సీనియర్ నేత జి. పరమేశ్వర్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది.
మంత్రివర్గంలో 32 మందికి స్థానం!
ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 32 మంది వరకు మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం, డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంప్రదింపుల ఆధారంగానే మంత్రివర్గ తుది కూర్పు ఖరారయ్యే అవకాశం ఉంది.
మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న నేతల జాబితాలో ఎంబీ పటేల్, జి. పరమేశ్వర్, కేజీ జార్జి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కేబీ గౌడ, లక్ష్మీ హెబ్బాల్కర్, బి. సురేష్, సంతోష్ లాడ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం కలిగిన నేతలు.
మరోవైపు అసెంబ్లీ స్పీకర్ పదవికి కూడా పోటీ ఆసక్తికరంగా మారింది. సీనియర్ నేతలు హెచ్‌ఎం మునియప్ప, హెచ్‌కే పటేల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మంత్రివర్గం, స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. డీకే శివకుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దశలోకి అడుగుపెట్టబోతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.