క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- దేశంలో గత కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ కొన్నాళ్ల నుంచి తగ్గుతున్న జనాభా రేటు కారణంగా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం విడుదల చేసిన తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది. దేశంలో గత కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుముఖం పడుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు మాదిరిగానే భారతదేశంలోనూ సంతానోత్పత్తి రేటు పడిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున రెండు పాయింట్ ఒకటి ప్రసవాలు (రీప్లేస్మెంట్ లెవెల్) అవసరం ఉంది. కానీ భారత్లో సంతాన ఉత్పత్తి రేటు రీప్లేస్మెంట్ లెవల్ కంటే తక్కువగా నమోదయింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం 2024 నివేదిక ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదు కాగా, 2023 లోను 1.9గానే నమోదయింది. ఇది కోవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..
దేశంలో జననాల రేటు భారీగా తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆఫీస్ తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో సంతాన ఉత్పత్తి రేటు వరుసుగా 5 ఏడాది కూడా రీప్లేస్మెంట్ లెవెల్ (2.1) కంటే తక్కువగా నమోదవడం, మరణాల రేటు కోవిడ్ ముందు స్థాయి కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2024లో దేశంలో జననాల రేటు ప్రతి 1000 జనాభాకు 18.3 గా ఉండగా 2023 లో 18.4 గా నమోదయింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 14.9 నుంచి 14.7 కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 20.3 నుంచి 20.2 కి పడిపోయింది. జననాల రేటులో మార్పు కనిపించినప్పటికీ ప్రతి 1000 జనాభా కు సంభవించే మరణాల సంఖ్య స్థూల మరణాల రేటు (సిడిఆర్) సగటు 6.4 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నవజాత శిశు మరణాలు రేటు తగ్గుముఖం పట్టడం కూడా కాస్త ఉపశమనం కలిగించే అంశంగా ఈ నివేదిక వెల్లడించింది. అయితే జననాల రేటు తగ్గుముఖం పట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎక్కువమంది పిల్లలను కనాలి అనే ప్రతిపాదనలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు కంటే ఎక్కువ పిల్లల్ని కనే వారికి నజరానాలను అందిస్తామని ప్రకటించారు. ఈ బాటలోనే మరి కొంతమంది ముఖ్యమంత్రులు పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న బలమైన కారణం జననాల రేటు భారీగా తగ్గుముఖం పట్టణంగా నిపుణులు పేర్కొంటున్నారు.