Homeతెలంగాణబీజేపీలోకి రేవంత్ రెడ్డి...! గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం...

బీజేపీలోకి రేవంత్ రెడ్డి…! గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం…

  • ఇప్పటికిప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో సాధ్యమే

  • హస్తం పార్టీలో ఇబ్బందులు వస్తే.. ఆప్షన్ గా కమలం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారా? ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఆయన భారతీయ జనతా పార్టీ గూటికి చేరే చాన్స్ ఉందా? ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో రేవంత్ అటువైపు ప్రయాణం ఉండబోతుందా? తాజాగా బిజెపి ఎంపీ ఒకరు తెలంగాణ సువేందు అధికారిగా రేవంత్ రెడ్డి ని ఎందుకు అభివర్ణించారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపై నే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో రేవంత్ కు బిజెపి అనే ఆప్షన్ ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఏబీవీపీ తో ప్రస్థానం…

ఏబీవీపీ తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. ఆ అనుభవంతోనే 2006లో జడ్పిటిసి గా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. 2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని పిలిచి మరి కొడంగల్ అసెంబ్లీ స్థానం ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో రేవంత్ విజయం సాధించారు. 2014లో సైతం కొడంగల్ నుంచి రెండోసారి గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తో తెలంగాణలో కెసిఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టారు చంద్రబాబు. ఆ సమయంలో కెసిఆర్ పార్టీ పై విరుచుకుపడేవారు రేవంత్. కానీ కెసిఆర్ పాచికలకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయింది.

ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ పగ్గాలను అప్పగించారు. కానీ అప్పటికే టిడిపి పై ఆకర్ష్ ప్రయోగంలో.. ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరారు. ఇక టిడిపిలో కొనసాగలేనని.. భవిష్యత్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఒక నిర్ణయానికి వచ్చారు రేవంత్. టిడిపి అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2021 లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కాంగ్రెస్ నాయకత్వం సైతం రేవంత్ కు ఛాన్స్ ఇచ్చింది. సీనియర్ నేతలు ఉన్న 2023 ఎన్నికల్లో సారధ్య బాధ్యతలు అప్పగించింది. స్టార్ క్యాంపైనర్ గా మారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రెండున్నర సంవత్సరాల పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లారు.

కాంగ్రెస్ లో స్వేచ్ఛ…

కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలైన నాయకులు ఉన్నారు. వారందరికీ కాదని రేవంత్ కు ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్ మార్కు రాజకీయాలను దాటుకుంటూ.. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ.. తనకంటూ ఉన్న ఇమేజ్ను కొనసాగిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని.. తరువాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని.. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఆ టీంలో కొనసాగుతానని తనకు తాను ప్రకటించుకున్న గొప్ప ధైర్యం ఉన్న నేత రేవంత్ రెడ్డి. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఆ పార్టీకి తాను ఒక ఆశాదీపం అయ్యారు. అలా రేవంత్ ద్వారా పూర్వవైభవం రావడంతో కాంగ్రెస్ పార్టీ సైతం అతడిని గుర్తించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

ప్రధాని పర్యటనతో…

అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం ప్రధానితో వేదిక పంచుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ ఉండాల్సింది అక్కడ కాదు అని.. తనతో కలిసి పనిచేస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అప్పటినుంచి సీఎం రేవంత్ బిజెపిలో చేరుతారన్న ప్రచారం జాతీయ స్థాయిలో సైతం జరుగుతోంది. కానీ సీఎం రేవంత్ మాత్రం ఈ దేశానికి రాహుల్ ప్రధాని అయ్యేందుకు తనవంతు కృషి ఉంటుందని చెబుతున్నారు.

కేవలం అభివృద్ధి పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యత కానీ.. రాజకీయంగా ఎంత మాత్రం కాదని తేల్చేశారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణలో తన సమర్థ రాజకీయ నాయకత్వాన్ని పెంచుకున్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎదగకపోయినా.. కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ కు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా.. బిజెపి రూపంలో ఒక ఆప్షన్ ఉంది. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతను కచ్చితంగా బిజెపి అక్కున చేర్చుకుంటుంది. అంతవరకు రేవంత్ బిజెపి లో చేరిక ఒక ఊహాగానం మాత్రమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు