క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత 47 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అత్యంత జాగ్రత్తగా పాటించాలి అని అధికారులు చూసిస్తున్నారు. ఈ తీవ్రమైన వేడి వాతావరణం (Heatwave) నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలు
దాహం వేయకపోయినా సరే గంట గంటకూ నీరు తాగుతూ ఉండాలి. నీటితో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు అందుతాయి.
ఆల్కహాల్, కాఫీ, టీ మరియు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు.
పగటి పూట కిటికీలకు పరదాలు వేసి ఉంచాలి. రాత్రి వేళల్లో గాలి వచ్చేలా చూసుకోవాలి. పార్క్ చేసిన కార్లు లేదా ఇతర వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను అస్సలు ఉంచకూడదు. తేలికపాటి, లేత రంగు గల కాటన్ (నూలు) దుస్తులను ధరించాలి.
బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. ముఖానికి, చేతులకు కాటన్ రుమాలు కట్టుకోవాలి. గుర్తింపుఅధిక శరీర ఉష్ణోగ్రత, తీవ్రమైన తలనొప్పి, మైకం రావడం, వాంతులు కావడం, చర్మం ఎర్రబడటం వంటివి వడదెబ్బ లక్షణాలు.
ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని చల్లని ప్రదేశానికి చేర్చి, తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.