క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పీఠాన్ని దక్కించుకోవడంపై కూటమి నాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎ న్నికల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కీలకంగా ఉన్న కార్పొరేషన్లను దక్కించుకోవడంపై కూటమి నాయకులు దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఏపీలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అతిపెద్దది. ఈ కార్పొరేషన్‌కు చాలా ఏళ్ల తరువాత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రేటర్ పీఠంపై అప్పట్లో వైసీపీ జెండా ఎగురవేసింది. కానీ, సార్వత్రిక ఎన్నికలు జరిగిన 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దీంతో అనేక చోట్ల మాదిరిగానే విశాఖలో కూడా గ్రేటర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అనేక మంది కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సుమారు ఏడాదిపాటు మేయర్‌గా పీలా శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో గ్రేటర్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళుతుండడంతో మరోసారి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.
కూటమిలో సఖ్యత కుదిరేనా.?
2021లో నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను దక్కించుకుని పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీ 30 వార్డులు, జనసేన మూడు వార్డులు, స్వతంత్ర అభ్యర్థులు మరోనాలుగు వార్డులు, భారతీయ జనతా పార్టీ ఒక వార్డు, సీపీఐ, సీపీఎం ఒక్కో వార్డు చొప్పున దక్కించుకున్నాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం తరువాత అనేక మంది సభ్యులు కూటమి పార్టీల్లో చేరడంతో విజయాన్ని దక్కించుకున్నాయి. ఇదే ఇప్పుడు కూటమి పార్టీకి ఇబ్బందిగా మారునంది. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎంతో మంది కూటమి పార్టీల్లో చేరారు. వారంతా ఇప్పుడు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే, పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు పలు స్థానాలను కేటాయించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు టీడీపీకి కత్తి మీద సాములా మారనుంది. ఇప్పటికే కొన్నేళ్ల నుంచి పనిచేస్తూ వస్తున్న టీడీపీ నాయకులు ఇతర పార్టీలకు సీట్లు కేటాయిస్తే కలిసి పని చేస్తారా.? అన్నది ప్రశ్నార్థంగా మారింది.
వైసీపీ వ్యూహం ఏమిటి..?
గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీలో స్తబ్ధత అలుముకుంది. కేడర్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తొలి నుంచి విశాఖలో వైసీపీ బలమైన నాయకత్వం లేదు. గడిచిన ఎన్నికలకు ముందు, ఫలితాలు తరువాత కొందరు ముఖ్యమైన నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇవన్నీ ఆ పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయి. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు విశాఖ కేంద్రంగా కొన్నాళ్లుగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారంతా బలంగా దృష్టి సారిస్తే కొంత వరకు ఫలితం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కూటమిని ఎదుర్కొని నిలబడాలంటే బలమైన వ్యూహంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంటుంది. ఆ దిశగా వైసీపీ వ్యూహా రచన చేస్తోందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.